జోడి’ మూవీ రివ్యూ

జోడి’ మూవీ రివ్యూ

0

టైటిల్‌ : జోడి
జానర్‌ : ఫ్యామిలీ డ్రామా
నటీనటులు : ఆది సాయి కుమార్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, నరేష్‌, వెన్నెల కిశోర్‌, సత్య
సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్‌
నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం
దర్శకత్వం : విశ్వనాథ్‌ అరిగెల

తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ, ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ అదరణ ఉంటాయనే విషయం పలుమార్లు రుజువైంది. తాజాగా ఫ్యామిలీ, లవ్‌స్టోరితో వచ్చిన చిత్రం జోడి. యువ హీరో ఆది సాయికుమార్, జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా సరైన విజయం ఖాతాలో చేరకుండా ఆదికి, జెర్సీ విజయంతో జోష్ మీద ఉన్న శ్రద్ధా శ్రీనాథ్‌కు జోడి చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ : కమలాకర్‌ రావు (నరేష్‌) బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ వ్యక్తి. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు క్లబ్‌లో ఉంటూ క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడుతూ ఉంటాడు. క్రికెట్ మీద పిచ్చితో కొడుక్కి కపిల్‌ అని పేరు పెంటుకుంటాడు. తండ్రి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటంతో ఆ బాధ్యతను తాను తీసుకుంటాడు కపిల్‌ (ఆది సాయి కుమార్‌). సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే కపిల్‌, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ ఇన్సిస్టిట్యూట్‌లో పనిచేసే కాంచనమాల(శ్రద్ధా శ్రీనాథ్‌)తో ప్రేమలో పడతాడు. కపిల్ మంచితనం, బాధ్యతగా ఉండటం చూసి కాంచనమాల కూడా కపిల్‌ను ఇష్టపడుతుంది. కానీ కాంచన, బాబాయి రాజు (శిజ్జు) మాత్రం వారి పెళ్లికి అంగీకరించడు. తన అన్న కూతురిని ప్రాణంగా చూసుకునే రాజు.. కాంచన, కపిల్‌ల పెళ్లికి ఎందుకు నో చెప్పాడు..? ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం ఏంటి..? ఈ కథలోకి ఇండస్ట్రియలిస్ట్‌ అవినాష్‌ ఎలా వచ్చాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు : కెరీర్‌ స్టార్టింగ్‌లోనే లవర్‌ బాయ్‌గా ఆకట్టుకున్న ఆది సాయి కుమార్‌ కపిల్ పాత్రలో ఈజీగా నటించేశాడు. రొమాంటిక్‌ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. తన కామెడీ టైమింగ్‌తోనూ అలరించాడు. కాంచనమాల పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌ ఒదిగిపోయారు. జెర్సీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ శ్రద్ధా ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్‌ చేసుకున్నారు. తండ్రి పాత్రలో సీనియర్‌ నరేష్‌ మరోసారి సూపర్బ్ అనిపించాడు. కామెడీతో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ తన మార్క్‌ చూపించాడు. వెన్నెల కిశోర్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన కడుపుబ్బా నవ్వించాడు. ఇతర పాత్రల్లో సత్య, శిజ్జు, గొల్లపూడి మారుతీరావు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ : మద్య, ధూమపానం ఓ వ్యక్తిని చంపేస్తాయి. కానీ జూదం ఆ వ్యక్తినే కాకుండా తన చుట్టూ ఉన్నవారిని కూడా చంపేస్తాయి అనే చక్కటి పాయింట్‌ జోడి సినిమా రూపొందింది. వ్యక్తిగతంగా పాత్రలను చూస్తే సినిమా బాగుంటుంది. మొత్తంగా పాత్రలన్నీ కలిపి చూస్తే.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన మ్యాజిక్ కనిపించదు. స్క్రిప్టుపై సరైన కసరత్తు జరగకపోవడం, కథ, పాత్రల కోసం ఎంచుకొన్న బ్యాక్‌డ్రాప్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఫ్యామిలీ, ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండి ఉంటే తప్పకుండా మంచి సినిమా అయ్యేది. దర్శకుడు విశ్వనాథ్ ఆ అవకాశాన్ని జారవిడచుకున్నారని చెప్పవచ్చు. అలాగని చెత్త సినిమా అని కొట్టిపారేయలేం. స్లోగా కథను నడిపించడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. రకరకాల ట్విస్టులు ఉన్నా సినిమాపై జోష్ పెంచలేకపోయాయి.

ప్లస్‌ పాయింట్‌ :
కథ
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
నెమ్మదిగా సాగే కథనం
రొటీన్‌ టేకింగ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here