గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీ రివ్యూ..

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీ రివ్యూ..

0

నటీనటులు: వరుణ్ తేజ్ – అధర్వ మురళి – పూాజా హెగ్డే – మృణాళిని రవి – బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
కథ: కార్తీక్ సుబ్బరాజ్
అడిషనల్ డైలాగ్స్: మిథున్ చైతన్య – మధు శ్రీనివాస్
నిర్మాతలు: రామ్ ఆచంట – గోపీనాథ్ ఆచంట
రచన – దర్శకత్వం: హరీష్ శంకర్.

దబాంగ్‌’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారన్నపుడు పవన్‌కళ్యాణ్‌ ఫాన్స్‌ కూడా ‘ఇప్పుడెందుకొచ్చిన రీమేక్‌ ఇది’ అనుకున్నారు. అయితే ఒక సాధారణ కథని తీసుకుని పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌కి అనుగుణంగా ‘మార్పులు’ చేసి పదకొండేళ్ల పాటు అభిమానులు ఎదురుచూసిన బ్లాక్‌బస్టర్‌ని ఇచ్చాడు హరీష్‌ శంకర్‌. కథ చెప్పడం తెలిస్తే, కమర్షియల్‌ మీటర్‌ మీద పట్టుంటే తెలిసిన కథనే ఎంత ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు అనే దానికి అదో చక్కని ఉదాహరణ. ఈసారి ‘జిగర్తాండ’ అనే క్లాసిక్‌ క్రైమ్‌ కామెడీని ‘వాల్మీకి’గా రీమేక్‌ చేసాడు. ఇప్పుడు కూడా దర్శకుడిగా తనకి కమర్షియల్‌ అంశాల మీద వున్న గ్రిప్‌ చూపించినా కానీ ఈసారి హరీష్‌ శంకర్‌ ఎంచుకున్న కథ ‘దబాంగ్‌’ లాంటి సాధారణ కథ కాదు. ‘జిగర్తాండ’ ఒక మంచి కాన్సెప్ట్‌ బేస్డ్‌ క్రైమ్‌ కామెడీ. ఆ కథలో విలన్‌గా హీరో ఇమేజ్‌ వున్న వరుణ్‌ తేజ్‌ని తీసుకోవడంతో హరీష్‌ శంకర్‌ చాలానే ‘మార్పులు’ చేసాడు. ఈ ‘మార్పులు’ అన్నీ ‘మార్కులు’ వేయించుకోవు కానీ ‘మాసెస్‌’ కనక్ట్‌ అయ్యే అంశాలకి అయితే లోటు లేదు.

కథనం – విశ్లేషణ : చాలా కొత్తగా అనిపించే కథ.. అందులో వావ్ అనిపించే ఒక విలన్ పాత్ర.. తమిళంలో క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘జిగర్ తండ’కు ప్రధాన ఆకర్షణలివే. కథను మించి అందులో బాబీ సింహా చేసిన విలన్ పాత్ర హైలైట్ అయి ఆ సినిమాను నిలబెట్టేసింది. ‘జిగర్ తండ’ను రీమేక్ చేయాలని అనుకున్నపుడు.. విలన్ పాత్ర కోసం బాబీ సింహానే తీసుకోవాలనే ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఆ పాత్రకు మరొకరిని పైగా ఒక హీరోను ఎంచుకోవడం హరీష్ శంకర్ చేసిన సాహసం. అతను అంతటితో ఆగలేదు. తమిళంతో పోలిస్తే తెలుగులో ఆ పాత్ర టోన్ మార్చేశాడు. గెటప్ హావభావాలు నటన.. అన్నింట్లోనూ మార్పు చూపించాడు.

అసలే హరీష్ ఒక ఫ్లాప్ తీసి వెనుకబడి ఉన్నాడు. పైగా ఇప్పుడు ఒక క్లాసిక్ ను ముట్టుకున్నాడు. ఇలాంటి స్థితిలో మాతృకకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన పాత్రపై ఇలా చేయి చేసుకోవడం మామూలు సాహసం కాదు. ఐతే ఒక కన్విక్షన్ తో అతను చేసిన ఈ మార్పులు వృథా పోలేదు. బాబీ సింహా పాత్రను ఉన్నదున్నట్లుగా తీస్తే – బాబీ సింహానే అందులో నటిస్తే తెలుగు ప్రేక్షకులు ‘వాల్మీకి’ని ఎలా రిసీవ్ చేసుకునేవారో కానీ.. హరీష్ తనదైన టచ్ ఇస్తూ తీర్చిదిద్దిన గద్దలకొండ గణేష్ పాత్ర.. అందులో వరుణ్ తేజ్ నటన పెద్ద ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ప్రేక్షకుల దృష్టి మరల్చనీయకుండా చేసిన ఆ పాత్రే సినిమాను నిలబెట్టేసింది. మాతృక చూసిన వాళ్లు అందులో ఉన్న క్లాస్ – క్లాసిక్ టచ్ తెలుగులో మిస్సయిందని ఫీలైతే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ‘వాల్మీకి’ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఎంటర్టైనర్ అనడంలో సందేహం లేదు.

అభినయ పరంగా ఇక మరెవరి ప్రస్తావన కూడా అక్కర్లేకుండా వరుణ్‌ తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు. ఇంతకుముందు తనని చూసిన వారికి ఆ పాత్రలేవీ గుర్తు రానంతగా ఈ పాత్రలోకి ఒదిగిపోయాడు. నటుడిగా ఒకేసారి నాలుగు మెట్లు ఎక్కేసాడు. పూజ హెగ్డే కనిపించేది కాసేపే అయినా కానీ తన గ్లామర్‌తో శ్రీదేవి అంత ఎఫెక్టివ్‌గా అనిపించింది. అధర్వ సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ మెయింటైన్‌ చేస్తూ ఏదో ఛల్తా అనిపించాడు కానీ తెలుగు వారికి తెలిసిన నటుడయితే బాగుండేది. తనికెళ్ల భరణికీ, సుప్రియా పాఠక్‌కి ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసే మంచి సీన్లు ఇవ్వగా వారిద్దరూ ఆ సన్నివేశాలకి జీవం పోసారు.

వరుణ్‌ తేజ్‌కి ఇది ఎలాగయితే మేక్‌ ఓవరో అలాగే సంగీత దర్శకుడు మిక్కీ మేయర్‌కి కూడా ఇది టెర్రిఫిక్‌ మేకోవర్‌. మాస్‌ చిత్రానికి ఇంతవరకు మనకి తెలియని మిక్కీని వినిపించాడు. వాక్కా వాక్కా థీమ్‌ మ్యూజిక్‌తో అయితే గద్దలకొండ గణేష్‌ పాత్రని మరో లెవల్‌కి ఎలివేట్‌ చేసాడు. డైలాగ్స్‌, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఎస్సెట్స్‌ అయ్యాయి.

చివరగా చెప్పాలంటే గద్దల కొండా గణేష్ ( వాల్మీకి ) క్లాస్ కథలో మాస్ మెరుపులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here